పెండింగ్ రైల్వే లైన్లను పూర్తి చేయండి
స్పష్టం చేసిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. పాలనా పరంగా అన్ని శాఖలను రివ్యూ చేస్తున్నారు. త్వరితగతిన పనులు పూర్తయ్యేలా ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా తనను మర్యాద పూర్వకంగా కలిశారు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ . ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయం కావాలన్నా చేసేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. వికారాబాద్ – కృష్ణా రైల్వే లైన్ అభివృద్దికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అంతే కాకుండా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే లైన్ల అభివృద్ధి, కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు సంబంధించి చర్చించారు.
గతంలో ప్రతిపాదించిన వికారాబాద్ – కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధి పైనా సమావేశంలో చర్చ జరిగింది. ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురైన ఈ మార్గాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మార్గాన్ని పూర్తి చేస్తే పరిసర ప్రాంతాల అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.
సమీప ప్రాంతాల్లో పరిశ్రమలను నెలకొల్పేందుకు వీలుంటుందన్నారు. ఈ సమావేశంలో రవాణ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.