ప్రజాస్వామ్యం ప్రపంచానికి అవసరం
పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
లండన్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి లండన్ టూర్ లో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రముఖులతో భేటీ అయ్యారు. ఇదే సమయంలో చారిత్రాత్మకమైన 1,100 సంవత్సరాల వెస్ట్ మినిష్టర్ భవనం వద్ద బ్రిటీష్ పార్లమెంటేరియన్లను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. దీనిని హౌస్ లు ఆఫ్ పార్లమెంట్ అని పిలుస్తారు.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం. ఇవాళ ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. ప్రధానంగా ఉగ్రవాదం, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, యుద్దం, హింస , హక్కుల నిరాకరణ, ప్రజాస్వామ్యంపై దాడి, అణు ఆధిపత్య పోరు, దేశాల మధ్య విద్వేషం, మతం పేరుతో మారణ హోమం లాంటి అనేక సమస్యలు చుట్టు ముట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కానీ వీటన్నింటికి ఒక్కటే సమాధానం ఉందని, అది కేవలం ప్రజాస్వామ్యం మాత్రమేనని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలను శక్తివంతం చేయడమే మిగిలి ఉందన్నారు. ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి , ఇక్కడ మాట్లాడేందుకు అవకాశం కల్పించింది కూడా ప్రజాస్వామ్యమేనని పేర్కొన్నారు. దీనికి మూల కారకుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని తెలిపారు.