బిల్కిస్ పోరాటానికి సలాం
ప్రశంసించిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన గుజరాత్ కు చెందిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసుకు సంబంధించి 11 మంది దోషులను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గుజరాత్ సర్కార్ విడుదల చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసన , ఆందోళన కొనసాగింది.
దీనిని సవాల్ చేస్తూ బాధితురాలు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించి సోమవారం తీవ్ర స్థాయిలో కోర్టులో వాదోప వాదనలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా కేసును విచారించిన జస్టిస్ నాగరత్న, జస్టిస్ భూయాన్ లతో కూడిన ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది.
ఒక రకంగా సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ సర్కార్ కు కోలుకోలేని దెబ్బ అని చెప్పక తప్పదు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొంది. వెంటనే ఆ 11 మంది దోషులను తిరిగి జైలుకు పంపించాల్సిందేనంటూ స్పష్టమైన తీర్పు వెలువరించింది.
ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ. ఎన్నికల ప్రయోజనాల కోసం న్యాయాన్ని చంపేసే ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని హెచ్చరించారు.
నేరస్థులను పెంచి పోషించే వారు ఎవరో ఇవాళ ఈ తీర్పుతో తేట తెల్లమైందని పేర్కొన్నారు. ఏది ఏమైనా బాధితురాలు బిల్కిస్ బానో చేసిన అలుపెరుగని పోరాటం స్పూర్తి దాయకమని ప్రశంసించారు.