బీజేపీ..బీఆర్ఎస్ రెండూ ఒక్కటే
మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్
హైదరాబాద్ – తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పంటూ ఏమీ లేదన్నారు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ . ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముట్టుకునే ధైర్యం మాజీ సీఎం కేసీఆర్ కు ఆయన పరివారానికి లేదన్నారు. ఇవాళ అలాంటి ప్రయత్నం అనేది చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
భారత రాష్ట్ర సమితి పార్టీ అనేది గడువు తీరిన టాబ్లెట్ లాంటిదని ఎద్దేవా చేశారు. బీజేపీ గనుక మరోసారి కేంద్రంలో అధికారంలోకి గనుక వస్తే బీఆర్ఎస్ రెండు ముక్కలు కావడం ఖాయమని జోష్యం చెప్పారు. బీజేపీ మాజీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పటేల్ కు చురకలు అంటించారు. తమ గురించి ఆలోచించడం మానేసి ముందు మీ గురించి ఆలోచించు కోవాలని సూచించారు.
కులం, మతం పేరుతో రాజకీయాలు చేసే దౌర్భాగ్యం తమకు లేదన్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని తేలి పోయిందన్నారు. అందుకే రెండు పార్టీలను దూరం పెట్టారని చెప్పారు పొన్నం ప్రభాకర్.
ప్రజలు తమను అక్కున చేర్చుకున్నారని, తమకు ఎలాంటి భయం, ఢోకా అన్నది లేదన్నారు మంత్రి. ఐదు సంవత్సరాల పాటు తాము ప్రజా పాలన అందిస్తామని స్పష్టం చేశారు.