మోదీ గుప్పిట్లో మీడియా – రాహుల్
అందుకే ప్రజా యాత్ర చేపట్టా
అరుణాచల్ ప్రదేశ్ – ఈ దేశంలో మీడియా మౌనంగా ఉంది. కారణం బలమైన ప్రభుత్వం తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్ని వ్యవస్థలను నాశనం చేసింది. ప్రజల గొంతుకగా ఉండాల్సిన ప్రచురణ, ప్రసార మాధ్యమాలన్నీ అత్యధికంగా మోదీ సర్కార్ ను ప్రచారం చేస్తున్నాయి. ఈ దేశంలో ఎన్నో సమస్యలు కొలువు తీరి ఉన్నాయి. కానీ వాటి గురించి పట్టించు కోక పోవడం అన్యాయం కాదా అంటూ ఆవేదనతో ప్రశ్నించారు వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ.
తాను చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర అస్సాంలో ముగిసింది. శనివారం అరుణాచల్ ప్రదేశ్ కు చేరుకుంది. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడైనా మీడియా అన్నది ప్రజల పక్షం వహిస్తుందని, కానీ ఇండియాలో అందుకు భిన్నంగా వ్యవహరించడం దారుణమన్నారు.
దీనికి ప్రధాన కారకులకు బీజేపీ నేతలేనని ఆరోపించారు రాహుల్ గాంధీ. మోదీ ప్రచారం తప్ప ఈ దేశానికి ఇంకేమీ లేదా లేక కనిపించడం లేదా అని నిలదీశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మీడియాను కబ్జా చేశాయంటూ వాపోయారు . మీడియా ప్రభుత్వ పక్షం వైపు ఉండడంతో తాను ప్రజల కోసం పాదయాత్రను ఎంచుకున్నానని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.