జూనియర్ ఎన్టీఆర్..కళ్యాణ్ రామ్
హైదరాబాద్ – యుగానికి ఒక్కడు మాత్రమే పుడతాడని ఆ యుగ పురుషుడు దివంగత నందమూరి తారక రామారావు మాత్రమేనని స్పష్టం చేశారు ప్రముఖ నటులు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్. జనవరి 18న దివంగత సీఎం ఎన్టీఆర్ వర్దంతి. ఈ సందర్బంగా హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్. ఎన్టీ రామారావు గురించి తెలియని వారంటూ ఈ లోకంలో ఉండరన్నారు. నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పర్చుకున్నారని, వేలాది మందికి స్పూర్తి దాయకంగా నిలిచారని కొనియాడారు. ఆయన కుటుంబానికి చెందిన వారమై ఉండడం తమ పూర్వ జన్మ సుక్రుతమని పేర్కొన్నారు.
ఈ లోకం ఉన్నంత దాకా, సూర్య చంద్రులు ప్రకాశిస్తున్నంత కాలం నందమూరి తారక రామారావు బతికే ఉంటారని స్పష్టం చేశారు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. మన దేశం చిత్రంతో చిత్ర రంగంలోకి ప్రవేశించిన ఎన్టీఆర్ తెలుగు సినిమాను ప్రపంచం గుర్తించేలా చేశారని అన్నారు.
ఇక తెలుగుదేశం పార్టీని స్థాపించి వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ ను మట్టి కరిపించిన ఘనుడు ఒక్క ఎన్టీఆర్ మాత్రమేనని అన్నారు. దేశ రాజకీయాలలో చెరగని సంతకం ఎన్టీఆర్ అన్న మూడు అక్షరాలు అని కొనియాడారు నటులు.