యుగానికి ఒక్కడు ఎన్టీఆర్
నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – ఎన్టీఆర్ మహానాయకుడని కొనియాడారు తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. జనవరి 18న ఈ లోకాన్ని వీడారు. ఇవాళ ఆయన వర్దంతి. ఈ సందర్బంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు.
విశ్వ విఖ్యాత నటనా సార్వభౌమునిగా అటు చలన చిత్ర సీమకు ఇటు తెలుగు నాట రాజకీయ చైతన్యాన్ని రగిలించిన మహా నాయకుడు ఎన్టీఆర్ అని ప్రశంసలు కురిపించారు. యావత్ లోకం ఉన్నంత వరకు ఆయన నిత్యం వెలుగుతూనే ఉంటారని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు. దేశంలో సంక్షేమ ఫలాలను పేదలకు అందించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు.
ఒకే ఒక జీవితం, రెండు తిరుగులేని చరిత్రలు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతుబిడ్డ సాధించిన అద్వితీయ విజయానికి ప్రతీక నందమూరి తారక రామారావు అని అన్నారు. తెలుగునాట నిరుపేదకు అలనాటి రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది… తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన తెలుగు వెలుగు ఎన్టీఆర్ అని కొనియాడారు. పేదరికం లేని సమాజాన్ని, కులమతాలకు అతీతమైన సమ సమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయడమే మన కర్తవ్యం కావాలని పిలుపునిచ్చారు.