NATIONALNEWS

రాముడి స్పూర్తితో ఆద‌ర్శ పాల‌న

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన ఒడిస్సా సీఎం ప‌ట్నాయ‌క్

ఒడిస్సా – ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ్రీ‌రాముడిని ఆద‌ర్శంగా తీసుకుని తాము స‌మ‌ర్థ‌వంత‌మైన పాల‌న సాగిస్తున్నామ‌ని తెలిపారు. ఆయ‌న వ్య‌క్తిగ‌త కార‌ణాల రీత్యా అయోధ్య లోని శ్రీ‌రాముడి పునః ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మానికి వెళ్ల లేక పోయారు. అయితే త‌న నివాసంలోనే టీవీ ద్వారా ఈ ప‌విత్రోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని వీక్షించారు. ఈ సంద‌ర్బంగా త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను వెలిబుచ్చారు.

ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న ఆనందాన్ని పంచుకున్నారు. దేశ వ్యాప్తంగా శ్రీ‌రాముడి జ‌పం చేయ‌డం మంచిదేన‌ని పేర్కొన్నారు. ఏదో ఒక విశ్వాసం అన్న‌ది లేక పోతే మ‌నుషులు ఇబ్బందులు ప‌డ‌తార‌ని తెలిపారు. అందుకే పెద్ద‌లు వేదాలు, ఇతిహాసాల గురించి బోధిస్తార‌ని పేర్కొన్నారు సీఎం.

నీతి, నిజాయితీ, ధ‌ర్మం, విలువ‌ల‌తో కూడిన జీవితం ఈనాటి దేశ ప్ర‌జ‌ల‌కు అత్యంత అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు న‌వీన్ ప‌ట్నాయ‌క్. ప్ర‌తి దానిలోనూ మంచి అనేది ఉంటుంద‌ని దానిని గుర్తించి ఆచ‌రించే ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు. దీని వ‌ల్ల మాన‌సిక ఉల్లాసంతో పాటు క‌ష్టాల క‌డ‌లి నుంచి ఒడ్డుకు చేరే ఛాన్స్ ఉంటుంద‌న్నారు.