రెడ్ బుక్ అంటే భయం ఎందుకు
నిప్పులు చెరిగిన నారా లోకేష్
అమరావతి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. పదే పదే తనను టార్గెట్ చేస్తున్న వాళ్లు రెడ్ బుక్ అంటే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. తప్పు చేయక పోతే ఇంకెందుకు భయపడాలని ప్రశ్నించారు నారా లోకేష్.
యువ గళం పాదయాత్ర సందర్బంగా జరిగిన సభల్లో నారా లోకేష్ పదే పదే రెడ్ బుక్ గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. ఇందులో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారితో పాటు తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలను చితక బాదారని , అయినా వైసీపీ వారి ఆగడాలను చూస్తూ ఊరుకున్నారంటూ ఆరోపించారు.
చట్టం ముందు అందరూ సమానమేనని, రెడ్ బుక్ లో రాసిన వారిని తాము అధికారంలోకి వచ్చాక వదిలి పెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు నారా లోకేష్. తప్పు చేసిన వాళ్లకు భయం ఉంటుందన్నారు. ప్రజాస్వామ్య స్పూర్తిని కాపాడాల్సిన అధికారులు, ప్రజా ప్రతినిధులు వాటిని తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు . ప్రతిపక్షాలను నామ రూపాలు లేకుండ చేయాలని అనుకున్నారని మండిపడ్డారు.
రాజ్యాంగ స్పూర్తికి భంగం కలిగించిన వారిపై తప్పకుండా విచారణ చేపడతామని, ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని ఇది తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జరుగుతుందని పేర్కొన్నారు నారా లోకేష్.