వైసీపీకి షాక్ ఎంపీ గుడ్ బై
సంజీవ్ కుమార్ రాజీనామా
కర్నూలు – ఏపీలో కొలువు తీరిన వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పలువురు కీలక నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా మరో వికెట్ కోల్పోయింది ఆ పార్టీ. రాయలసీమ ప్రాంతంలో మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి ఇది పెద్ద దెబ్బ అని చెప్పక తప్పదు.
ఉమ్మడి ఏపీ రాజధానిగా ఉన్న కర్నూల్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న డాక్టర్ సంజీవ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. బుధవారం ఆయన తాను పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంపీ పదవితో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకుంటున్నట్లు తెలిపారు.
అయితే ఇంకా ఏ పార్టీలో చేరాలనేది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ ఐదేళ్ల కాలంలో తాను అనుకున్నంత మేర అభివృద్ది పనులు చేపట్టలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు చాలా సార్లు ప్రయత్నం చేశానని చెప్పారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఎవరూ తన ఫోన్ ను ఎత్తలేదని, ఇది తనను బాధకు గురి చేసిందన్నారు. బీసీలకు పెద్దపీట వేస్తామని చెబుతారని కానీ ఆచరణలో అది ఉండదని సంచలన ఆరోపణలు చేశారు. మొత్తంగా డాక్టర్ సంజీవ్ కుమార్ రాజీనామాతో పార్టీలో కొంత చర్చకు దారి తీసింది.