సంక్షేమ కార్యక్రమాలు ఆపితే ఊరుకోం
కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ ఆగ్రహం
హైదరాబాద్ – తాము ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ఆపితే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దళిత బంధు పథకంలో ఎంపికైన లబ్దిదారులకు చెందిన అకౌంట్లను నిలిపి వేసిందని ఆరోపించారు. అంతే కాకుండా గృహలక్ష్మి పథకాన్ని అన్యాయంగా రద్దు చేసిందని మండిపడ్డారు.
పేద ప్రజల సంక్షేమం కోసం ఉద్దేశించిన పథకాలను , కార్యక్రమాలను రద్దు చేయడం దారుణమన్నారు కేటీఆర్. 50 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. విప్లవాత్మకమైన, వినూత్నమైన కార్యక్రమాలను అమలు చేసేందుకు ముందుకు రాలేదన్నారు. కానీ తాము వచ్చాక అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పథకాలను రూపొందించడం జరిగిందని చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన దళిత బంధు, గృహలక్ష్మి, బీసీ బందు, గొర్రెల పంపిణీ వంటి కార్యక్రమాల అమలును నిలిపి వేసే కుట్రను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని ధ్వజమెత్తారు. దళితులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందన్నారు. గొర్రెల పంపిణీ కోసం డీడీలు కట్టినా పట్టించు కోవడం లేదని వాపోయారు.