కోదండరాంకు ఎమ్మెల్సీ పక్కా
స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ జన సమితి పార్టీ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం రెడ్డికి తీపి కబురు చెప్పారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ముందు నుంచీ పార్టీ కోసం కష్టపడిన వారికి, తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో టికెట్లు రాని వారికి, ఆఖరు నిమిషంలో సీట్లు మారిన వారికి తప్పకుండా వివిధ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లుగా అవకాశం ఇస్తామని అన్నారు.
ఈ సందర్భంగా టీజేఎఫ్ చీఫ్ కోదండరాం రెడ్డి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయనకు తప్పకుండా ఎమ్మెల్సీ కోటాలో పదవి ఇస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ముందు నుంచీ కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చారని అన్నారు. ఇదే సమయంలో ఎన్నికల సందర్భంగా పోటీ చేయకుండా విరమించు కున్నారని తెలిపారు.
కోదండరాం రెడ్డితో పాటు పలువురు మేధావులు, బుద్ది జీవులను కూడా పరిగణ లోకి తీసుకుంటామని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో ఎలాంటి అనుమానం చెందాల్సిన పని లేదన్నారు. ప్రస్తుతానికి వ్యవస్థలను గాడిలో పెట్టే పనిలో ఉన్నామని, 100 రోజుల వ్యవధిలో ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని కుండ బద్దలు కొట్టారు .
మాజీ సీఎం కేసీఆర్ పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 420 పేరుతో బావ బావమరుదులు కేటీఆర్, హరీశ్ రావు నోటికి వచ్చినట్లు మాట్లాడటాన్ని తప్పు పట్టారు రేవంత్ రెడ్డి.