బీఆర్ఎస్ పార్టీ భవన్ కు నోటీసు
పార్టీ ఆఫీసులో టీ న్యూస్ ఛానల్
హైదరాబాద్ – రాష్ట్రంలో నిన్నటి దాకా అధికారాన్ని చెలాయిస్తూ ..అడ్డగోలుగా పాలన సాగించిన భారత రాష్ట్ర సమితి పార్టీకి, ఆ పార్టీ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కు, ఆయన తనయుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావుకు బిగ్ షాక్ తగులుతోంది. అధికారం మారడం కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి రావడంతో ఒక్కటొక్కటిగా డొంక కదులుతోంది.
పార్టీ ఆధ్వర్యంలో టీ న్యూస్ ఛానల్, తెలంగాణ టుడే , నమస్తే తెలంగాణ పేరుతో పత్రికలు నిర్వహిస్తోంది. అయితే టీ న్యూస్ ఛానల్ ఉద్యమ కాలం నుంచీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో నిర్వహిస్తూ వస్తోంది. ఇందుకు సంబంధించి తాజాగా కోలుకోలేని దెబ్బ తగిలింది.
బీఆర్ఎస్ పార్టీ భవన్ కు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. పార్టీ ఆఫీసులో ఛానల్ ఎలా నిర్వహిస్తారని, ఎలా వ్యాపారం చేస్తున్నారంటూ ఆ నోటీసులలో పేర్కొంది. ఇదిలా ఉండగా ఇచ్చిన నోటీసులో కీలక వ్యాఖ్యలు చేసింది.
పార్టీ ఆఫీసు నుండి టీ న్యూస్ ఛానల్ ను ఎప్పటి లోగా మారుస్తారో వారం లోగా వివరణ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ భవన్ ఇంఛార్జ్ శ్రీనివాస్ రెడ్డిని కోరింది. ఈ మేరకు నోటీసు జారీ చేసింది.