
కోట్లాది అడవి బిడ్డల ఆక్రందనలు, కన్నీళ్ల మధ్య సెలవు తీసుకున్నాడు శాశ్వతంగా శిబు సోరేన్. నా శ్వాస మీకోసం, ఈ దేహం ఈ అందమైన అడవిలోనే సేద దీరాలని అనుకుంటోందంటూ వెళ్లి పోయాడు. సామాజిక సంస్కర్త నుండి దిగ్గజ గిరిజన నాయకుడిగా ఆయన సాగించిన ప్రస్థానం అద్వితీయం, చారిత్రాత్మకం. ఈ దేశ చిత్ర పటంలో జార్ఖండ్ అనే రాష్ట్రం ఉందంటే దానికి కారణం తనే. పుట్టుకతోనే కష్టాలను చవి చూసిన తను స్వేచ్ఛ లేకుండా ఎలా బతకడం అంటూ ప్రశ్నించాడు. అందుకే తను ఓ కలను కన్నాడు. ఆ అద్భుతమైన కల ప్రత్యేక రాష్ట్రం . దానిని సాధించుకుంటేనే మనం బతికి ఉండగలం లేక పోతే చరిత్రలో ఆనవాళ్లు లేకుండా పోతామని గుర్తించాడు. తను ఒక్కడే అడుగు వేసిన శిబు సోరేన్ తన లాంటి వారిని వేలాది మందిని తయారు చేశాడు. జార్ఖండ్ కలను నిజం చేసేందుకు తను సాగించిన పోరాటం, ఆందోళన, నిరసన గురించి ఎంత చెప్పినా తక్కువే. అడవిని ప్రేమించని వాళ్లే ఇవాళ రాజ్యాధికారంలో ఉంటే మరి అడవిని నమ్ముకుని, జంతువులతో సహవాసం చేసే మాలాంటి బిడ్డలకు ఈ భూమి మీద ఉండేందుకు హక్కు లేక పోతే ఎలా అని నిలదీశాడు. తన స్వరాన్ని పెంచాడు శిబు సోరేన్.
సామాజిక సంస్కర్తగా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. ప్రత్యేక జార్ఖండ్ కోసం సోరేన్ ఎన్నో త్యాగాలు చేశారు. విలువైన కాలాన్ని కోల్పోయాడు కూడా. ఆయనను అంతా తమ భాషలో బాపూ అని పిలుచుకుంటారు. జనవరి 11న ఉమ్మడి బీహార్ లోని నెమ్రా ఊరులో 1944లో పుట్టాడు. రుణ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఇది రైతులు నిత్యం వడ్డీ వ్యాపారుల నుంచి ఎలా దోపిడీకి గురవుతున్నారో, ఎలా మోస పోతున్నారో కళ్లారా చూశాడు. ద్రవ్య రుణ వ్యవస్థను నిరసించాడు. సామాజిక నిర్మాణాన్ని సవాల్ చేశాడు. సంథాల్ గిరిజన సమూహం నుండి వచ్చాడు శిబు సోరేన్. విద్య అన్నది అడవి బిడ్డలకు ఎందుకు లేదని ఆలోచించాడు. పాఠశాలలకు వెళ్ల లేని పిల్లలకు రాత్రి పూట బడులు నిర్వహించాడు. అందుకే ఆయనను అంతా గురూజీ అని పిలుచుకుంటారు. దిషోమ్ గురుగా పేరు పొందిన శిబు సోరేన్ రాజకీయ నేత మాత్రమే కాదు , విచ్ఛిన్నమైన పోరాటాలను ఏకం చేసిన విప్లవాత్మక స్పూర్తి అని చెప్పక తప్పదు. దోపిడీ, సామాజిక వివక్ష, భూమి పరాయీకరణపై యుద్దం ప్రకటించాడు. అట్టడుగున ఉన్న అణగారిన ప్రజల కోసం పరితపించాడు శిబు సోరేన్. దోపిడీ వ్యవస్థలకు వ్యతిరేకంగా తన స్వరం పెంచాడు. అడవుల నుండి శాసన సభల దాకా గొంతు లేని వారికి తను అండగా నిలిచాడు.
1972లో జార్ఖండ్ ముక్తి మోర్చా పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. ఇందులో శిబు సోరేన్ కీలక పాత్ర పోషించాడు. 1987లో జేఎంఎం తన చేతుల్లోకి వచ్చింది. ఆ తర్వాత జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైంది. ఆయన మూడుసార్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
శిబు సోరేన్ ను ఏ పదవితో పోల్చలేం. ప్రజలందరికీ సమ న్యాయం దక్కాలని కోరుకున్నాడు. ఒంటరిగా కంటే సంఘటితంగా ఉండాలని పిలుపునిచ్చాడు. దానిని ఆచరించేలా చూపించాడు. స్వయం పాలన కోసం దీర్ఘ కాల పోరాటాలకు ఆయన చిహ్నంగా మిగిలి పోయాడు. భారత దేశంలో అత్యంత ప్రజా దరణ పొందిన నాయకులలో ఒకడిగా ఉన్నారు శిబు సోరేన్. తనను ఇలా మార్చడానికి కారణం ఈ భూమేనంటూ ప్రకటించాడు కూడా. వడ్డీ వ్యాపారుల చేతిలో తన తండ్రి హత్యకు గురి కావడం తనలో పోరాడే స్వభావాన్ని పెంచేలా చేసింది. భూమిని తిరిగి పొందడం అన్నది ప్రామాణికం కావాలని నినదించాడు. హత్యా యత్నాలు, ద్రోహాలు, నిరంతర బెదిరింపులను తట్టుకుని నిలబడ్డాడు శిబు సోరేన్. రాష్ట్రం కలను సాకారం చేయడమే కాదు ఆదివాసీల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచేలా చేశాడు. చివరి దాకా భూమితోనే బంధాన్ని కొనసాగిస్తూ వచ్చిన తను ఈ ఆకుపచ్చని అడవిలోనే సేద తీరేందుకు వెళ్లి పోతున్నానంటూ నిష్క్రమించాడు. జన నాయకుడా నీకు అల్విదా.