
రాజకీయాలలో శాశ్వతమైన మిత్రులు శత్రువులు ఉండరని తేలి పోయింది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల కారణంగా. ప్రపంచాన్ని గత కొంత కాలంగా డాలర్ శాసిస్తోంది. మార్కెట్ ఎకానమీపై చైనా పట్టు కలిగి ఉన్నప్పటికీ యుఎస్ తన ధోరణి మార్చుకునేందుకు ఇష్ట పడటం లేదు. కేవలం ఆయుధాలను సరఫరా చేస్తూ, అణుబాంబులు, మిస్సైల్స్, ఆధునిక రాడార్లను సాకుగా చూపి భయపెట్టడం, ఆధిపత్యం చెలాయించడం కొనసాగిస్తూ వస్తోంది. గతంలో ఈ విషయంలో కొంత ఆలస్యం జరిగేది. కానీ ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ కొలువు తీరాడో ఆనాటి నుంచి నేటి దాకా చిత్ర విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటూ ఇతర దేశాలను బెంబేలెత్తిస్తున్నాడు. ఆయన ఎన్నికల్లో ఒకటే నినాదంతో ముందుకు వెళ్లాడు. అమెరికా ఫస్ట్ . ఆ తర్వాతే ఇతర దేశాలకు ప్రయారిటీ అని ప్రకటించాడు. దీంతో అమెరికన్లకు రోజు రోజుకు ప్రాధాన్యత పెరుగుతోంది. కీలకమైన మార్పులు తీసుకు వచ్చేందుకు శ్రీకారం చుట్టాడు. యుఎస్ లో అత్యధికంగా ఆదాయం సమకూరుతోంది ఐటీ, ఫార్మా, లాజిస్టిక్, ఆటోమొబైల్స్ రంగాల నుంచి . కానీ వీటికంటే ఎక్కువ ప్రాఫిట్ లభిస్తోంది కేవలం ఆయుధ , రక్షణ, వైమానిక రంగాలకు సంబంధించిన పరికరాలను అమ్మడం ద్వారా.
ట్రంప్ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తూ వస్తున్నారు. భారతదేశంతో అమెరికాకు మిత్ర దేశమని పేర్కొంటూనే ఇంకో వైపు మోదీ తనకు స్నేహితుడంటూనే ఇండియాకు వెన్ను పోటు పొడవడం మొదలు పెట్టాడు. దాయాది పాకిస్తాన్ కు లోపాయికారిగా మద్దతు ఇస్తూనే నాటకాలకు తెర లేపాడు. ఇదే సమయంలో భారత్ లోని జమ్మూ కాశ్మీర్ పెహల్గామ్ దాడిలో 26 మంది పర్యాటకులను పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపారు. దీనికి ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సిందూర్ ప్రయోగించింది. పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది. వ్యాపార, వాణిజ్య పరంగా అన్నింటిని మూసి వేస్తున్నట్లు ప్రకటించింది. భారత్ దెబ్బకు పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలు ద్వంసం అయ్యాయి. యావత్ ప్రపంచం ఇండియా వైపు నిలిచింది. కానీ ఇదే సమయంలో ట్రంప్ ఫోన్ చేయడం , ఉన్నట్టుండి ఆపరేషన్ సిందూర్ ఆగి పోవడం జరిగింది. దీనికి తానే కారణం అంటూ ప్రకటించాడు ట్రంప్. అంతే కాదు పలు దేశాల మధ్య యుద్దాలను తాను ఆపానంటూ ప్రగల్భాలు పలికాడు. ఏకంగా వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కోరింది. ట్రంప్ నిర్వాకంపై పార్లమెంట్ లో చర్చ జరిగింది. ఈ సమయంలో ప్రధానమంత్రి తీవ్రంగా స్పందించారు.
ఈ సమయంలో భారత్ ను ఆర్థిక పరంగా దెబ్బ కొట్టేందుకు ప్లాన్ చేశాడు ట్రంప్. ఆ మేరకు రష్యాను బూచిగా చూపించాడు. చివరకు సుంకాల మోత మోగించాడు. పలు దేశాలపై కొంత శాతం విధిస్తే ఏకంగా ఇండియాకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. మొదట 25 శాతం విధిస్తున్నట్లు ప్రకటించాడు. ఆ తర్వాత మరో 25 శాతం పెంచుతున్నట్లు వెల్లడించాడు. దీంతో ఈ సుంకాల కారణంగా భారత దేశానికి చెందిన రైతులు, మత్స్యకారులు, రోయల ఉత్పత్తిదారులు, ఇతర రంగాలకు చెందిన వారిపై పెద్ద ఎత్తున ప్రభావం పడుతుంది. కోట్లాది మంది వీటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి బతుకుతున్నారు. దీనిపై క్లారిటీ ఇచ్చారు ప్రధానమంత్రి. ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాకు తల వంచే పరిస్థితి లేదన్నారు. ఎన్ని నష్టాలైనా సరే భరించేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. ట్రంప్ పూర్తిగా భారత్ పట్ల వ్యతిరేకత ధోరణితో ఉన్నారు. ఆయన తీసుకున్న తాజా నిర్ణయాల వల్ల తనకు ఆనందం కలగవచ్చని కానీ భవిష్యత్తులో అమెరికాకు పెద్ద ఎత్తున నష్టం చేకూరుస్తుందని తెలుసుకుంటే మంచిది.
కాగా ట్రంప్ చెబుతున్న కారణం రష్యాకు ఇండియా మద్దతు ఇవ్వడం. ముడి చమురు, సైనిక ఉత్పత్తులను కొనుగోలు చేస్తోందని వాటిని నిలుపుదల చేయాలని లేకపోతే సుంకాలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా టారిఫ్స్ విధిస్తే భారత్ కూడా తగ్గేదే లేదంటూ అమెరికా ఉత్పత్తులపై 17 శాతం సుంకాలు విధించింది. ట్రంప్ మాస్టర్ ప్లాన్ వేశాడు. తమ దేశానికి చెందిన కంపెనీలను భారత్ లోని డైరీ, వ్యవసాయ రంగాలలో డోర్స్ తెరవాలని చూశాడు. వాటికి ద్వారాలు తెరిస్తే ఈ రెండు రంగాలపై ఆధారపడిన కోట్లాది మందికి ఉపాధి లేకుండా పోతుంది. దీనికి నో చెప్పింది ఇండియా. అంతే కాదు సెకండ్ హ్యాండ్ ఉత్పత్తులు, పశువుల దాణాను విక్రయించేందుకు ఛాన్స్ ఇవ్వాలని అమెరికా అంటోంది. ఇక తాజాగా యుఎస్ విధించిన టారిఫ్ ల వల్ల ఇండియాలోని వస్త్ర ఎగుమతులు, వాహన విడి భాగాల, ఫార్మా , స్టీల్, సోలార్ పరికరాలు, ఆభరణాలు, అల్యూమినియం, ఐటీ సర్వీసుల రంగాలపై ప్రభావం పడనుంది. రాబోయే రోజుల్లో సుంకాల వ్యవహారం ఇరు దేశాల మధ్య మరింత అంతరాన్ని పెంచేందుకు దోహద పడే ప్రమాదం ఉంది. ట్రంప్ కారణంగా ఇకనైనా భారత్ మేక్ ఇన్ , మేడ్ ఇన్ ఇండియా వైపు చూస్తే బావుంటుంది.