సంచలన కామెంట్స్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలువురు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా కేటీఆర్ ప్రసంగించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి పనికిరాని పార్టీ అంటూ మండిపడ్డారు. ఈసారి జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే మోరీలో వేసినట్లేనని అన్నారు. హైదరాబాద్ నగరం తిరిగి అభివృద్ధి గాడిన పడాలి అంటే కేసీఆర్ సారు తిరిగి రావాల్సిందేనని స్పష్టం చేశారు. అది జూబ్లీహిల్స్ నుంచి మొదలు కావాల్సిందేనని చెప్పారు కేటీఆర్. తాము ఎన్నికల కోసం ఇచ్చిన హామీల అమలులో చేసిన మోసం గురించి కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు కోపంగా ఉన్నారని అన్నారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే నెలకు రూ. 4 వేల పెన్షన్లు వస్తాయని చెప్పారు కేటీఆర్. ఎన్నికల కోసం చెప్పిన హామీలన్నీ అమలు అవుతాయన్నారు. ఒకవేళ కాంగ్రెస్కు ఓటు వేస్తే, ప్రజలను తాము మోసం చేసినా ‘మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు’ అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందన్నారు. ఆరు గ్యారంటీలు చెప్పి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. అన్ని అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని అన్నారు కేటీఆర్. ఈ రెండు సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేక పోయిందంటూ ఎద్దేవా చేశారు. ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక్క ఇటుక పెట్టలేదు, కానీ రెండు లక్షల 30 వేల కోట్ల రూపాయల అప్పుల్ని మాత్రం చేసిందన్నారు. గరీబోళ్ల ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి బుల్డోజర్లు పంపించి, హైదరాబాద్లో ఇళ్లు కూలగొట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.






