స్పష్టం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
నంద్యాల జిల్లా : దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాలలో ఒకటైన నంద్యాల జిల్లాలో కొలువు తీరిన శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయాన్ని గురువారం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ దర్శించుకున్నారు. ఆయనకు సాదర స్వాగతం పలికారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల. పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ప్రధానికి. ఆలయంలోని మల్లన్న స్వామికి అభిషేకం చేశారు. పూజలు చేసిన అనంతరం ప్రధానమంత్రిని ఆశీర్వదించారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు మల్లన్న చిత్ర పటాన్ని పీఎంకు ఇచ్చారు.
ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూజలు చేసిన అనంతరం తన సంతోషాన్ని పంచుకున్నారు. తన జీవితంలో ఈ రోజు మరిచి పోలేనని పేర్కొన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో కొలువు తీరిన ఈ పుణ్య క్షేత్రం గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థించుకున్నాను. నా తోటి భారతీయుల సౌభాగ్యం కోసం, వారి ఆరోగ్యం కోసం ప్రార్థించాను. అందరూ సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు నరేంద్ర మోదీ. అనంతరం శ్రీశైలంలోని శివాజీ మ్యూజియంను సందర్శించారు. అక్కడి నుంచి కర్నూలుకు బయలుదేరి వెళ్లారు.







