నిప్పులు చెరిగిన బీజేపీ ఎంపీ రాజేందర్
సికింద్రాబాద్ : 42 శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. శనివారం బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు సికింద్రాబాద్ లోని జూబ్లీ హిల్స్ బస్ స్టేషన్ వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీరియస్ కామెంట్స్ చేశారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంత కాలం ఆ కుటుంబం వారికే అధికారం దక్కుతుందన్నారు. ఆ కుటుంబమే ఏలుతుందంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినా.. స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఒక్క బీసీ, ఒక ట్రైబల్ ముఖ్యమంత్రి కాలేక పోయారని ఆరోపించారు.
ఈ రాష్ట్రంలో బీసీలు 8 మంది మంత్రులు ఉండాలని , కానీ కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారని, వారిని కూడా సాగనంపే పనిలో ఉన్నారంటూ ఆరోపించారు ఈటల రాజేందర్. బీసీల పట్ల ముసలి కన్నీరు కాకపోతే నామినేటెడ్ పదవులలో ఎందుకు బీసీలకు స్థానం కల్పించ లేదని ప్రశ్నించారు. మోదీ కేబినెట్ లో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారని, ఈ ఘనత ఒక్క ప్రధానమంత్రికి మాత్రమే దక్కు తుందన్నారు ఎంపీ ఈటల రాజేందర్. బీజేపీ నిజాయితీని ఎవరు శంకించ లేరని అన్నారు. మాదిగ రిజర్వేషన్ చేస్తామని మాట ఇచ్చి అమలు చేశారని ప్రధానమంత్రి అని పేర్కొన్నారు. తమిళనాడులో ఏ పద్ధతి ప్రకారం చేశారో అదే పద్ధతిలో ఇక్కడ కూడా చెయ్యాలని డిమాండ్ చేశారు ఈటల రాజేందర్ . ఈ బంద్ కి పిలుపు ఇచ్చింది బీసీ జెఎసి అని, అనివార్యంగా అన్ని పార్టీలు పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.






