దీపావళి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు
హైదరాబాద్ : దీపావళి సందర్భంగా సోమవారం హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మ వారిని దర్శించుకున్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దీపావళి పర్వదినాన చార్మినార్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించు కోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియ చేస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయు రారోగ్యాలతో ఉండాలని ప్రార్థించడం జరిగిందన్నారు.
హైదరాబాద్ అంటేనే ఒకప్పుడు మత సామరస్యానికి ప్రతీకగా ఉండేదన్నారు. చార్మినార్ లో భాగంగా అమ్మవారి దేవాలయం ఉండడం హిందువులు ముస్లింలను గౌరవించడం, ముస్లింలు హిందువులను గౌరవించడం వంటి సాంప్రదాయాలు ఉన్న గొప్ప సంస్కృతి మనది అన్నారు హరీశ్ రావు. హైదరాబాద్ నగరం ఇంకా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని అమ్మవారిని ప్రార్థించానని చెప్పారు. రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేని పరిస్థితి నెలకొందన్నారు. ఒక రౌడీషీటర్ పోలీస్ కానిస్టేబుల్ ని చంపడం చాలా దురదృష్టకర సంఘటన అని పేర్కొన్నారు . స్వయాన ముఖ్యమంత్రే హోం మంత్రి అయ్యుండి కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలం కావడం దారుణమన్నారు.







