స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి : మొంథా తుపాను తీవ్రత కొనసాగుతుండడంతో ఏపీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష చేపట్టారు. ఆయా శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అలాగే పశువులకు ఇబ్బంది లేకుండా అవసరమైన పశుగ్రాశాన్ని కూడా గ్రామాల్లో ఉంచాలన్నారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు జల వనరుల శాఖ సిబ్బందిని సమాయత్తం చేశారు. పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది సమన్వయం చేసుకొంటున్నారు. పడా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల్లో పరిస్థితులను పర్యవేక్షించేందుకు గ్రామానికి ఒకరు చొప్పున ప్రత్యేక అధికారులను నియమించారు. ఉప్పాడలో బీసీ కార్పోరేషన్ ఈడీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
మూలపేట, కోనపాపపేటల్లో డివిజిన్ లెవల్ డెవలప్మెంట్ అధికారులను నియమించారు. అమీనాబాద్, అమరవిల్లిలలోనూ ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. పునరావాస శిబిరాల్లో ఉంటున్న ప్రజలకు ఆహారం ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు డి.డి.ఓ.ను, పెదపూడి తహసిల్దార్ లను నియమించారు. మండల స్థాయి అధికారులు, గ్రామ సచివాలయం సిబ్బంది మొత్తం సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. గ్రామీణ నీటి పారుదల శాఖ డి.ఇ. ఆధ్వర్యంలో రక్షిత తాగు నీరు ఏర్పాటు చేశారు. పునరావాస శిబిరాల్లో 12 వేల మందికి మధ్యాహ్న భోజనం, 15 వేల మందికి రాత్రి భోజనం ఏర్పాటు చేశారు. 5 వేల పాల ప్యాకెట్లు, 1.50 లక్షల వాటర్ ప్యాకెట్లతో పాటు వాటర్ ట్యాంకర్లను కూడా సిద్ధం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.






