పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన జగన్ రెడ్డి
తాడేపల్లి గూడెం : మొంథా తుపాను వల్ల సంభవించిన నష్టం, తర్వాత ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు మాజీ సీఎం జగన్ రెడ్డి.. తుపాన్ సమయంలో పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా నిలబడడాన్ని ప్రశంసించారు పార్టీ శ్రేణులను. పంట నష్టం అంచనాల్లో ఎక్కడా ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చూడాలని నిర్దేశించారు. పంట నష్టం అంచనాల్లో ప్రభుత్వం ఏ తప్పిదానికి ప్రయత్నించినా గట్టిగా ప్రశ్నించాలని, ఆ తప్పిదాన్ని సవరించుకునేలా చొరవ చూపాలని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకు రావడంపై పార్టీ నాయకులకు వైయస్ జగన్ దిశానిర్దేశం చేశారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొంథా తుపాన్ వచ్చినప్పటి నుంచి ప్రజలతో మమేకం అవుతూ మీమీ ప్రాంతాల్లో అసెంబ్లీ కోఆర్డినేటర్లు చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. పార్టీ పిలుపు మేరకు మీరంతా చాలా చక్కగా, చురుగ్గా పని చేస్తున్నారు. అందుకు మీ అందరికీ నా అభినందనలు తెలియ జేస్తున్నానని అన్నారు.
ఈ మధ్యకాలంలో చూసిన మోంథా తుపాన్ తీరని దుఖ్ఞాన్ని మిగిల్చిందని వాపోయారు జగన్ రెడ్డి. దాని బీభత్సం ఎక్కువే ఉంది. తుపాన్ తీవ్రత తగ్గినా, రైతులపై చాలా ప్రభావం చూపిందన్నారు. పంటలకు చాలా నష్టం జరిగింది. పంట పొట్టకొచ్చిన సమయంలో భారీ వర్షాలకు అవి నేలకొరిగాయి. దీంతో దిగుబడి దారుణంగా పడిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందారు . శ్రీకాకుళం నుంచి నెల్లూరు, అక్కణ్నుంచి రాయలసీమలో కర్నూలు, కడప, అన్నమయ్య, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో కూడా మొంథా తుపాన్ ప్రభావం చూపిందన్నారు. 25 జిల్లాలు, 396 మండలాలు, 3320 గ్రామాల పరిధిలో తుపాన్ ప్రభావం కనిపించిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు తోడుగా నిలబడాల్సి ఉందన్నారు. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలపై మొంథా తుపాన్ ప్రభావం చూపిందన్నారు. 11 లక్షల ఎకరాల్లో వరి పంట ,1.14 లక్షల ఎకరాల్లో పత్తి, 1.15 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2 లక్షల ఎకరాల మొక్కజొన్న, మరో 1.9 లక్షల ఎకరాల ఉద్యాన పంటలపై తుపాను ప్రభావం చూపిందన్నారు.






