నష్ట పరిహారం వెంటనే చెల్లించాలి
అమరావతి : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. తన ఆహ్వానం మేరకు క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రితో దాదాపు గంట సేపు వివిధ అంశాలపై చర్చించారు. ఇటీవల మొంథా తుఫాన్ వల్ల రాష్ట్రం ఎదుర్కొన్న నష్టాన్ని సీఎం ఆయనకు వివరించారు. రాష్ట్రంలో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఉన్న రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాలని విన్నవించారు. నూతన టెక్నాలజీని ఉపయోగించుకుని మొంథా తుపాను తీవ్రత నుంచి కాపాడు కోగలిగామని చెప్పారు. ఎక్కువగా ప్రాణ నష్టం జరగలేదని కానీ భారీ ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు కేంద్ర మంత్రికి చంద్రబాబు నాయుడు.
ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చిన పరిశీలన బృందం రాష్ట్రంలోని వివిధ తుపాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిందని చెప్పారు. ఇప్పటికే నివేదికలు కూడా కేంద్రానికి సమర్పించడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతానికి తాత్కాలిక అంచనాలతో రిపోర్టులు ఇచ్చామని, వాస్తవిక నివేదికలు తయారు అవుతున్నాయని వెల్లడించారు. దాదాపు 20 లక్షలకు పైగా పంటల్ని రైతులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణ సహాయం కింద రూ. 2 వేల కోట్లకు పైగా సాయం చేయాలని కోరారు కేంద్ర మంత్రి చౌహాన్ ను.






