మధ్యాహ్నం లోపే తుది ఫలితం వెల్లడి
హైదరాబాద్ : ఎంతో ఉత్కంఠ రేపిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠకు శుక్రవారం మధ్యాహ్నం వరకు తేలి పోనుంది. ఇప్పటికే రిటర్నింగ్ అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. యూసుఫ్‌గూడ లోని కోట్ల విజయభా స్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కౌంట్ డౌన్ సార్ట్ అయ్యింది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో లెక్కింపు ప్రారంభమైంది. కౌంటింగ్ కు సంబంధించి 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. గరిష్టంగా 10 రౌండ్లలోనే ఫలితం రానుంది. మొత్తం 59 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 24 మంది పోటీ నుంచి తప్పుకున్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో 186 మంది సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు ఎన్నికల అధికారి కర్ణన్. ఓట్ల లెక్కింపు సందర్బంగా చుట్టు పక్కల 144 సెక్షన్ విధించినట్లు చెప్పారు సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. ఇదిలా ఉండగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాగంటి గోపీనాథ్ అనారోగ్యం కారణాలతో మృతి చెందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. సెంటిమెంట్ పని చేస్తుందా లేక అభివృద్ది నినాదం పై చేయి చేస్తుందా అన్నది మధ్యాహ్నం లోపు తేలనుంది.






