బీఆర్ఎస్ అభ్యర్థిపై 25,658 ఓట్ల మెజారిటీ
హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ నమోదు చేశారు. నువ్వా నేనా అన్న రీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పోరు సాగింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా, సవాల్ గా తీసుకున్నారు. ఆయన ఏకంగా ఏడుసార్లు ఎన్నికల ప్రచారంలో ర్యాలీ చేపట్టారు. పలు హామీలు ఇచ్చారు. ఈ ఎన్నికను ఆయన తనదిగా భావించారు. హైకమాండ్ తో కొట్లాడి తన పరివారానికి చెందిన నవీన్ యాదవ్ కు టికెట్ ఇప్పించు కోవడంలో సక్సెస్ అయ్యారు. ఇటీవల కొంత హైకమాండ్ తో గ్యాప్ ఏర్పడినా చివరకు ఈ విజయంతో ఆ గ్యాప్ కూడా చెక్ పెట్టే ఛాన్స్ ఉంది. ఈ విజయంతో త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేశారు సీఎం.
ఇదిలా ఉండగా తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ కు చెందిన మాగంటి సునీతపై ఏకంగా 25 వేల 658 ఓట్ల మెజారిటీ సాధించారు కాంగ్రెస్ క్యాండిడేట్ పల్లాల నవీన్ యాదవ్. తన గెలుపులో అధికార పార్టీ కంటే బీసీ నినాదం పెద్దగా పని చేసింది. అన్ని బీసీ సంఘాలు కీలకమైన పాత్ర పోషించాయి. విచిత్రం ఏమిటంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరిగినా, ప్రచారం చేసినా చివరకు ఆ పార్టీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డికి కనీసం డిపాజిట్ కూడా దక్కక పోవడం గమనార్హం. ఇదిలా ఉండగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమిపై స్పందించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గట్టి పోటీ ఇచ్చామని, కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయమని తేలి పోయిందన్నారు.






