మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందడంపై స్పందించారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రజా పాలన పట్ల జనం సంతృప్తితో ఉన్నారని ఈ గెలుపుతో నిరూపితం అయ్యిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినా జనం నమ్మలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ సర్కార్ ముందుకు వెళుతోందని , అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. అందుకే జనం తమను నమ్మారని అత్యధిక మెజారిటీతో గెలిపించారని చెప్పారు.
మంత్రులంతా ఒకే తాటిపై ఉంటూ కలిసికట్టుగా అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేశామని చెప్పారు. ఇదే రిజల్ట్ త్వరలో రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిపీట్ అవుతుందని జోష్యం చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తాను ఇంఛార్జిగా ఉన్న రహ్మత్ నగర్ డివిజన్ ప్రజలు ఇచ్చిన మాట నిలబెట్టి భారీ మెజార్టీ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా నా పిలుపు మేరకు మద్దతిచ్చిన సినీ కార్మికులను అభినందించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని హామీ ఇచ్చారు. ఎన్ని ఆరోపణలు ఎదుర్కొన్నా ధైర్యంగా నిలబడి ఘన విజయం సాధించిన మా అభ్యర్థి నవీన్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.






