రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ
అమరావతి : అన్నింటి కంటే విద్య గొప్పదని, దానిని పొందితే ఎక్కడైనా వెళ్లి బతక వచ్చని అన్నారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. విద్యతోనే వికాసం అలవడుతుందని, జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఈ బాల్యమేనని, దీనిని సక్రమంగా వినియోగించు కోవాలని సూచించారు విద్యార్థులకు. మంగళవారం జె.పంగులూరు మండలం ముప్పవరం గ్రామంలోని పీఎస్‌ఎన్ సీసీ జెడ్పీ పాఠశాలలో 110 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లను అంద జేశారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. అద్దంకి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 5,100కిపైగా విద్యార్థులు, విద్యార్థినులకు ఉచిత సైకిళ్లను అందజేయడం ఆనందంగా ఉందన్నారు.
దూరాభారంతో చిన్నారులు పాఠశాలలకు వెళ్లడంలో ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పారు గొట్టిపాటి రవికుమార్. సీఎస్ఆర్ నిధులు, దాతలు, వ్యాపార సంస్థల సహకారంతో మరింత మంది విద్యార్థులకు సైకిళ్లు అందించే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. సైకిళ్ల పంపిణీ అనంతరం పాఠశాలల్లో హాజరు శాతం పెరుగుతున్నట్టు గమనించడం సంతోషకరం అన్నారు. జాతీయ రహదారులపై సైకిళ్లతో ప్రయాణించే సమయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతే కాకుండా రహదారి పక్కనే సురక్షితంగా ప్రయాణం చేసే విధంగా విద్యార్థులను అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. విద్యార్థుల సైకిల్ ప్రయాణాలపై తల్లిదండ్రులు కూడా అవసరమైన జాగ్రత్తలు తెలియజేయాలని సూచించారు.






