స్పష్టం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రం దూసుకు పోతోందని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. తాము ఇతర రాష్ట్రాలతో, దేశంతో పోటీ పడడం లేదని ప్రపంచంతో పోటీ పడుతున్నామని చెప్పారు. ఇవాళ ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, తదితర రంగాలలో హైదరాబాద్ టాప్ లో కొనసాగుతోందని అన్నారు. మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సారథ్యంలో హైదరాబాద్ లో జరిగిన అర్బన్ డెవలప్ మెంట్ మినిస్టర్స్ రీజినల్ మీటింగ్ లో పాల్గొన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ప్రపంచంతో పోటీపడి, 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందించాలని కేంద్ర మంత్రిని కోరారు.
రాష్ట్రాలకు సహకారం అందించడంలో కేంద్రం కీలకమైన పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు సీఎం. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్దన్న అని ప్రశంసలు కురిపించారు. ఈ సందర్బంగా తెలంగాణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని కోరారు ఎ. రేవంత్ రెడ్డి. రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళన, భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం, నగరానికి గోదావరి జలాల తరలింపు తదితర పథకాలకు త్వరిత గతిన అనుమతులు, ఇతర సహకారం అందివ్వాలని అన్నారు. స్వాతంత్ర దినోత్సవ శతాబ్ధి సంవత్సరమైన 2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో 10 శాతాన్ని తెలంగాణ నుంచి అందించే లక్ష్యంతో పని చేస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కోరారు సీఎం.






