ఎన్డీయే గెలుపుపై జన్ సురాజ్ అధినేత అనుమానం
పాట్నా : జన్ సురాజ్ పార్టీ అధినేత, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన పాట్నాలో మీడియాతో మాట్లాడారు. తాను కూడా రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోరీ పై చేసిన కామెంట్స్ తో ఏకీభవిస్తున్నానని అన్నారు. బీహార్ లో జరిగిన ఎన్నికల్లో చాలా పొరపాట్లు జరిగాయని ఆవేదన చెందారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు తన పనితీరు మార్చుకోవడం లేదో పునరాలోచించు కోవాలని సూచించారు. రిజల్ట్స్ వచ్చిన వెంటనే తాను ఓ ప్రతినిధులతో కూడిన బృందాన్ని మధుబనికి పంపించానని చెప్పారు. ఇందులో తేలింది ఏమిటంటే 30 శాతం మందికి ఆర్ఎల్ఎం గుర్తు గురించి తెలియదన్నారు. కానీ ఇక్కడ లక్షకు పైగా ఓట్లు వచ్చాయని, ఇది చెప్పాల్సింది కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని సీఎం నితీశ్ కుమార్ అని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ వెలిబుచ్చిన అభిప్రాయాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని స్పష్టం చేశారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ తాజా కామెంట్స్ బీహార్ రాజకీయాలలో కలకలం రేపుతన్నాయి. ఇదే సమయంలో ఎన్నికలలో తాము ఆశించిన మేర ఫలితాలు దక్కలేదని పేర్కొన్నారు. ఇందుకు తాను ఎవరినీ నిందించడం లేదన్నారు. ఈ ఓటమికి పూర్తిగా బాధ్యత నాదేనని స్పష్టం చేశారు ప్రశాంత్ కిషోర్. మరోసారి కాంగ్రెస్ ఎంపీ ఈ ఓట్ల చోరీకి సంబంధించి బండారాన్ని బయట పెట్టాలని హితవు పలికారు . ఇదిలా ఉండగా తాజాగా బీహార్ లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఏకంగా 203 సీట్లను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కూటమికి ఆశించిన మేర సీట్లు రాక పోగా ఉన్న సీట్లను పోగొట్టుకుంది.






