అంగరంగ వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. మూడో రోజైన బుధవారం ముత్యపుపందిరి వాహనంపై శ్రీ ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహన సేవలో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మ వారిని సేవించుకున్నారు.
ముద్దులొలికించే ముత్యాలు అలిమేలు మంగకు ప్రీతిపాత్రమైనవి. స్వాతికార్తెలో వాన చినుకులు సాగరంలోని ముత్యపు చిప్పల్లో పడి మేలుముత్యంగా రూపొందుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని అంటారు. అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో తెలియజేశారు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలు మంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలిగి, కైవల్యం చేకూరుతుందని విశ్వాసం.
రాత్రి 7 నుండి 9 గంటల వరకు సింహ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులను కటాక్షించనున్నారు.
వాహన సేవల్లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వి. వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు బాబు స్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.






