ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొణిదల
శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం. ప్రభుత్వ పరంగా నేడు జల్ జీవన్ మిషన్ పథకాన్ని తీసుకువస్తే.. ఏ ప్రభుత్వం ఆలోచన చేయని రోజుల్లో ఓ ఆధ్యాత్మిక గురువుగా ప్రజల దాహర్తిని తీర్చాలన్న ఆలోచన శ్రీ సత్యసాయి బాబా చేశారని ప్రశంసించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జల్ జీవన్ మిషన్ పథకానికి బాబా ఎప్పుడో అంకురం వేశారని అన్నారు. ప్రజల దాహం తీర్చాలన్న ఆలోచన వచ్చిన తరువాత శ్రీ సత్యసాయి బాబా అప్పటి సీఎం చంద్రబాబుకు తెలిపారు. ఆ సత్కార్యానికి ప్రభుత్వ పరమైన అనుమతులు వచ్చేలా చూశారు. నేడు ఆ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో లక్షలాది మంది ప్రజలకు తాగునీరు అందుతోందని చెప్పారు. ఆధ్యాత్మిక తేజస్సు, విశ్వప్రేమ ఉన్న వ్యక్తుల వల్లే ఇది సాధ్యమన్నారు.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గొప్ప ఆధ్యాత్మిక తేజస్సు కలిగిన వారు. భారత దేశంలో, మన రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం జిల్లా, విపరీతమైన నీటి కొరత ఉండే జిల్లా, ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్లే జిల్లాలో ఆయన పుట్టారు. మహానుభావులు మాత్రమే అలాంటి జన్మను తీసుకోగలరు. శ్రీ సాయిబాబా గొప్పదనం గురించి మన దేశస్తులకంటే విదేశీయులే ఎక్కువ చెబుతారు. 30 ఏళ్ల క్రితం సింగపూర్ లోని చైనీస్ ఇళ్లలో శ్రీ బాబా వారి ఫోటోలు చూశాను. స్టీవెన్ సిగాల్ అనే హాలీవుడ్ నటుడు బాబాని కలవాలన్న తన కోరికను అన్నయ్య చిరంజీవిని కోరారు. ఆయన ద్వారా ఇక్కడికి వచ్చి సత్యసాయి బాబా ఆశీర్వాదం తీసుకుని వెళ్లారని గుర్తు చేశారు.






