భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన టీటీడీ
తిరుపతి : తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమ్మ వారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డితో పాటు ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేవీఓ వి. వీరబ్రహ్మం, బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డిలు ఘనంగా స్వాగతం పలికారు.
రాష్ట్రపతి ముర్ము అమ్మ వారికి పూజలు చేశారు. ఆలయ అర్చకులు, పూజారులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మ వారి చిత్ర పటంతో పాటు ప్రసాదాన్ని టీటీడీ ఈవో రాష్ట్రపతికి బహూకరించారు. ద్రౌపది ముర్ము తిరుమల పర్యటన సందర్బంగా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా భద్రతా ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.







