అభినందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
హైదరాబాద్ : తెలంగాణకు చెందిన ఈఎంఆర్ఎస్ విద్యార్థులు అరుదైన ఘనత సాధించారు. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ క్రీడా విభాగాలలో సత్తా చాటారు. ఏకంగా 230 పతకాలను సాధించారు. ఓవర్ ఆల్ ఛాంపియన్స్ గా, ఓవర్ ఆల్ టీం ఛాంపియన్ గా, ఓవార్ ఆల్ ఇండివిడ్యూయల్ ఛాంపియన్ గా నిలిచారు. ఈ సందర్బంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పతకాలతో మెరిసిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. తమ సర్కార్ సపోర్ట్ వల్లనే ఇది సాధ్యమైందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా క్రీడల పట్ల మక్కువ కలిగి ఉన్నారని పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారని తెలిపారు.
విద్యార్థులు, యువత కోసం ప్రత్యేకంగా పాలసీని తీసుకు వస్తున్నామని చెప్పారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. తెలంగాణ EMRS వ్యవస్థ దేశంలోనే అత్యుత్తమ క్రీడా సదుపాయాలు, నైపుణ్యం, శిక్షణ అందిస్తున్నదనే దానికి ఈ విజయం నిదర్శనమన్నారు . రాబోయే రోజుల్లో విద్యార్థులు మరింత ప్రతిభ కనబర్చేలా వసతి సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో TGTWREIS సెక్రటరీ కే. సీతాలక్ష్మి, IAS, EMRS అధికారులు, కోచ్‌లు, టీచర్లు పాల్గొని విజేతలకు అభినందనలు తెలిపారు. ఇదిలా ఉండగా 230 పతకాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా ప్రశంసించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.







