రాష్ట్రంలో 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కీలకమైన పరిశ్రమలుగా వీటిని గుర్తించి మరో ఏడాదిపాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. తద్వారా ప్రభుత్వంపై రూ.1,053 కోట్ల భారం పడనుందన్నారు. మంగళవారం సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి, పీఎం కుసుమ్, ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద సోలార్ రూఫ్ టాప్ పథకం, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యయం తగ్గింపు తదితర అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ప్రత్యేకించి విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలను 2029 నాటికి 9.20 శాతం నుంచి గణనీయంగా తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఒప్పందాలు కుదుర్చుకోవాలని సీఎం సూచించారు. పీఎం కుసుమ్ సహా ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పీఎం కుసుమ్ ప్రాజెక్టు కింద 4,792 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వ భవనాలపై సౌర ఫలకలను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు 483కు పైగా ప్రభుత్వ భవనాలపై సౌర ఫలకలను ఏర్పాటు చేసి 150 మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తి చేసేలా కార్యాచరణ చేపట్టనున్నారు. ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజలు కూడా విద్యుత్ పొదుపు చేసేలా ఉపకరణాలు వినియోగించేందుకు అవగాహనా కార్యక్రమాల్ని చేపట్టాలని సీఎం సూచించారు. త్వరలో ఆర్టీసీకి 1000 ఈవీ బస్సులు ఇవ్వనున్నట్లు తెలిపారు.






