ప్రతి ఒక్క రైతును ఆంట్రప్రెన్యూర్ చేస్తాం
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ రంగానికి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో జరిగిన రైతన్నా మీ కోసం సభలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వ విధానాలతో రైతులందరూ ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటా రెండా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు సీఎం. రెవిన్యూ వ్యవస్థలో జరిగిన అవకతవకలపై మరింత ఫోకస్ పెడుతున్నానని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
.
జగన్ మోహన్ రెడ్డి చేసిన ల్యాండ్ గోల్మాల్ ను సరి చేసేందుకే ఎక్కువ సమయం పడుతోందని చెప్పారు.
గత పాలకులు భూముల విషయంలో చాలా దౌర్జన్యాలు చేశారని ఆరోపించారు. దీని వల్ల అసలైన రైతులకు అన్యాయం జరిగిందన్నారు. తాము కోరుకున్న భూములు ఇవ్వకుంటే వాటిని 22-ఏ లో పెట్టేశారని ధ్వజమెత్తారు. వీటన్నింటినీ సరి చేసేలా నేను ప్రయత్నిస్తున్నానని చెప్పారు . గత ప్రభుత్వం వైఖరి వల్ల రాష్ట్ర మొత్తం విధ్వంసానికి గురైందని వాపోయారు. అభద్రతా భావంలోకి వెళ్లిపోయారని పేర్కొన్నారు. వ్యతిరేక ఓటు చీలడానికి వీళ్లేదని నాటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారని, ఆ తర్వాత బీజేపీ కూడా జత కట్టిందన్నారు నారా చంద్రబాబు నాయుడు.






