77 డీడీఓ కార్యాలయాలను ప్రారంభించిన పవన్
అమరావతి : రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 డీడీఓ కార్యాలయాలను వర్చువల్ పద్ధతిలో చిత్తూరు నుంచి గురువారం ప్రారంభించారు. కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో నర్సీపట్నం నుంచి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు , తెనాలి నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ , ఆత్మకూరు నుంచి మంత్రి ఆనం రాం నారాయణరెడ్డి, టెక్కలి నుంచి మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, పెనుకొండ నుంచి మంత్రి సవిత, పలు చోట్ల ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గాధీజీ మాటలే స్ఫూర్తిగా గ్రామాలను పట్టుగొమ్మలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రజా పాలనకు అనుగుణంగా సంస్కరణలు తెస్తున్నాం అన్నారు. గత అయిదేళ్లలో పంచాయతీరాజ్ వ్యవస్థలో జరిగిన అన్ని పరిణామాలను మదింపు చేసి, అందరూ మెచ్చేలా సరికొత్త వ్యవస్థను తీసుకొస్తున్నామని ప్రకటించారు పవన్ కల్యాణ్. ఏళ్ల నుంచి పంచాయతీరాజ్ వ్యవస్థలో పదోన్నతులకు నోచుకోని సిబ్బందికి కూడా ఊరట నిస్తుందన్నారు. డీడీఓ కార్యాలయాల్లో ఆర్.డి.ఒ. స్థాయి అధికారిని నియమిస్తున్నామని ప్రకటించారు. ఇప్పటి వరకు కేవలం జిల్లా పంచాయతీరాజ్ అధికారి పరిధిలోనే అన్ని జరిగేవి. ఇప్పుడు స్థాయిని పెంచి, సేవల విస్తృతిని పెంచుతున్నామని చెప్పారు.






