రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
పెనుకొండ, సత్యసాయి జిల్లా : జగన్ రెడ్డి కూలిస్తే తాము నిర్మిస్తున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి సవిత. ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపాలన్న లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీవో కార్యాలయాలను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. డివిజన్ స్థాయిలో ఉన్న అన్ని శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకు రావడం జరిగిందన్నారు. డీడీవో కార్యాలయాను మినీ కలెక్టరేట్లుగా రూపొందిస్తోందని తెలిపారు. ఇలా అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండడం వల్ల పాలనా సౌలభ్యం కలుగుతుందన్నారు. ప్రజా సమస్యలకు కూడా తక్షణ పరిష్కారాలు లభిస్తాయన్నారు మంత్రి సవిత. 2014-19 మధ్య రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు.
జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఆనాడు గ్రామాల్లో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, కాలువలు నిర్మించామన్నారు. గ్రామాల్లో ఎల్ఈడీ బల్బులతో వీధి దీపాలు ఏర్పాటు చేశామన్నారు. మరోసారి కూటమి ప్రభుత్వం రావడంతో, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు కేంద్ర నుంచి నిధులు తీసుకు రావడంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను జగన్ కూలిస్తే పాలన సౌలభ్యం, ప్రజా సమస్యల పరిష్కారాల కోసం నూతన కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, డీడీవో రామకృష్ణయ్య, వివిధ శాఖల అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






