సవాల్ విసిరిన మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి : మాజీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రజలలో, ప్రత్యేకించి రైతులలో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. తన హయాంలోనే వ్యవసాయ రంగాన్ని సర్వ నాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సర్కార్ ను బద్నాం చేసేందుకు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ దమ్ముంటే బహిరంగ వేదికగా చర్చకు రావాలని సవాల్ విసిరారు అచ్చెన్నాయుడు. రైతుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం పారదర్శకంగా, శాస్త్రీయంగా ఉంటుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా రాతపూర్వక హామీలను కూడా నిలబెట్టుకోకుండా మోసం చేయడం ఈ ప్రభుత్వ లక్ష్యం కాదని స్పష్టం చేశారు.
జగన్ చేస్తున్న ఈ బాధ్యతారహిత ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు అచ్చెన్నాయుడు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ యంత్రాంగం కష్టపడుతుండగా అడ్డంకులు సృష్టించే రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తారని మంత్రి అన్నారు. జగన్ పాలనలో రైతులు ఆర్థిక పరంగా, మానసికంగా కుంగి పోయారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం వ్యవసాయం, వ్యవసాయాధారిత రంగాలను దేశంలోనే ఆదర్శంగా నిలిపేలా పునరుజ్జీవింప జేస్తోందని మంత్రి చెప్పారు. జగన్ రికార్డు స్థాయిలో పంట ధరలు పతనమయ్యాయని ఆరోపించడం హాస్యాస్పదమని అన్నారు. వాస్తవానికి రైతులకు తక్షణ మార్కెట్ జోక్యం అందించేందుకు ప్రభుత్వం 2025–26 బడ్జెట్‌లోనే రూ.300 కోట్లు కేటాయించిందని చెప్పారు. అవసరాన్ని బట్టి ఇప్పటికే 800 కోట్లకు పైగా మద్దతు ధరల రూపంలో ఖర్చుచేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.






