పార్లమెంట్ లో ప్రస్తావించిన ఈటల రాజేందర్
ఢిల్లీ : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పార్లమెంట్ లో కీలక సమస్యలను ప్రస్తావించారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని కోరారు. 40 లక్షల ఓటర్లతో 70 లక్షల జనాభా కలిగిన మల్కాజిగిరి పార్లమెంట్ లోని జవహర్ నగర్ లో 40 ఏండ్ల కిందట డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారని అన్నారు. అప్పుడు ఒకటి రెండు చెత్త వాహనాలు వచ్చి చెత్త వేసేవి కానీ ఇవాళ 10 వేల టన్నుల చెత్తను ఒకే చోట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈటల రాజేందర్. 30 కి.మీ. చుట్టూ అక్కడ నివసిస్తున్న లక్షల మంది ప్రజలు డంపింగ్ యార్డ్ నుండి వచ్చే దుర్వాసన, కీటకాల వల్ల చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వాపోయారు.
ఒకే చోట ఇంత పెద్ద డంపింగ్ యార్డ్ ఉండొద్దని 1.5 కోట్ల జనాభా ఉన్నా హైదరాబాద్ నగరంలో నాలుగు మూలల డంపిగ్ యార్డులు ఏర్పాటు చేయాలని ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిందని చెప్పారు ఎంపీ ఈటల రాజేందర్. ఇందుకు సంబంధించి 2017 నుండి చాలాసార్లు చెన్నైలో ఉన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్నారు. అయినా ఇప్పటివరకు ఎటువంటి పరిష్కారం చూపలేదన్నారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును త్వరగా అమలు చేయాలని, జవహర్ నగర్, చుట్టూ ప్రాంతాల ప్రజలను ఈ సమస్య నుండి దూరం చేయాలని కోరారు.






