బలిదానాలు ఏమాత్రం పరిష్కారం కాదు
హైదరాబాద్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని తీవ్ర మనస్థాపానికి గురైన సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదానం చేసుకోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. శుక్రవారం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. బలిదానాలు, ఆత్మహత్యలు ఎన్నటికీ పరిష్కారం కాదని పేర్కొన్నారు. బతికి ఉండి సాధించాలని, ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రజలకు, ప్రత్యేకించి యువతను కోరారు కల్వకుంట్ల కవిత. తను బలిదానం చేసుకోవడం తనను కలచి వేసిందన్నారు..
కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పడంతోనే సాయి ఈశ్వర్ చారి ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నానని తెలిపారు కల్వకుంట్ల కవిత. ఇప్పటికైనా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ సర్కార్, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే బీసీలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కేవలం ఎన్నికల కోసం కాకుండా చట్ట బద్దత కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తాము ముందు నుంచీ కోరుతూనే వస్తున్నామని స్పష్టం చేశారు. దయచేసి ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కవిత కోరారు. అణగారిన, వెనుకబాటుకు గురైన బీసీ వర్గాలు కలిసికట్టుగా ముందుకు సాగాలని, ఆ దిశగా ప్రయత్నం చేయాలని సూచించారు.






