సంచలన ప్రకటన చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అత్యంత వెనుకబాటుకు గురైన ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాలలో టాప్ లో నిలబెడతామన్నారు. జిల్లాకు విశ్వ విద్యాలయం మంజూరు చేస్తామన్నారు. ఎక్కడ పెట్టాలన్నది స్థలం ఎంపికను ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు చర్చించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఈ వర్సిటీని ఇంద్రవెల్లిలో పెడితే బాగుంటుందని నా అభిప్రాయం అని పేర్కొన్నారు. దానికి కొమురం భీం విశ్వ విద్యాలయంగా నామకరణం చేస్తే మరింత బాగుంటుందని చెప్పారు రేవంత్ రెడ్డి. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఎక్కడ పెట్టాలన్నది ఉమ్మడి జిల్లాకు చెందిన మీపైనే ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి.
ఆదిలాబాద్ జిల్లాకు నీరివ్వడానికి 150 మీటర్ల ఎత్తులో ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినప్పటికీ గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పక్కన పెట్టిందని ఆరోపించారు . తొందరలోనే పనులు ప్రారంభించి ప్రాజెక్టును చేపట్టి రైతులను ఆదుకునే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు. అలాగే చనాక – కొరాట ప్రాజెక్టు పనులను కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. ఆదిలాబాద్‌లో విమానాశ్రయం నిర్మాణంపై ప్రత్యేక దృష్టిని సారిస్తానని. ఏడాది తిరిగే లోపు విమానాశ్రయ నిర్మాణ పనులను ప్రారంభిస్తామని ప్రకటించారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో ఎర్ర బస్సులు ఆపడమే కష్టమనుకున్న ప్రాంతంలో విమానాలు దిగేలా చేస్తామన్నారు.






