రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత
అమరావతి : రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం పనులు చేపట్టామని అన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. సీఎం చంద్రబాబు పాలనపై జగన్ తప్పా ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. జగన్ అసమర్థ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల డైట్, కాస్మోటిక్ బిల్లులు సైతం చెల్లించ లేదన్నారు. చివరికి పోయిన బల్బు మార్పుకోడానికి కూడా నిధులు ఇవ్వలేదన్నారు. 2014-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్మించిన బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్లు 70 నుంచి 80 శాతం పూర్తయినా పట్టించు కోలేదన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే హాస్టళ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. హాస్టళ్ల మరమ్మతులతో పాటు డైట్, కాస్మోటిక్ బకాయిలు సైతం చెల్లించామన్నారు. ఇదే సోమందేపల్లిలోని బాలికల హాస్టల్ కు నిధులిచ్చి అభివృద్ధి చేశామన్నారు. త్వరలో సోమందేపల్లిలో బీసీ బాలుర హాస్టల్ ను నిర్మించనున్నట్లు తెలిపారు.
ఎన్నికల ముందు అమరావతికి జై కొట్టిన జగన్ అధికారంలోకి రాగానే మాట మార్చేసి, మూడు ముక్కలాట ఆడారని మంత్రి సవిత మండిపడ్డారు. దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ నిలిచి పోయిందన్నారు. రాజధాని అమరావతిపై జగన్ కు మాట్లాడే అర్హత లేదని మంత్రి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణానికి నిధులు పెద్ద ఎత్తున కేటాయిస్తోందన్నారు. భావి తరాలకు అభివృద్ధి చెందిన రాజధానిని అందివ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కోసం పెట్టుబడులు తీసుకొస్తోందన్నారు.






