ధీమా వ్యక్తం చేసిన మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్ : రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. రాబోయే కాలంలో తిరిగి బీఆర్ఎస్ పవర్ లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు మాజీ సీఎం కేసీఆర్. తన నియోజకవర్గంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లు తనను కలిశారు. ఈ సందర్బంగా వారిని పేరు పేరునా పలకరించారు కేసీఆర్. శాలువాలు కప్పి స్వీట్లు పంపిణీ చేశారు. వారికి ధైర్యం చెప్పారు. మనకు అన్ని కాలాలు అనుకూలంగా వుండయి. కొన్నికొన్ని సమయాలు కష్టాలు వస్తయి. వాటికి వెరవకూడదు. మల్లా మన ప్రభుత్వమే వస్తది. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయన్నారు. అప్పటి వరకు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అధైర్య పడొద్దు అని ధైర్యం చెప్పారు కేసీఆర్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో స్వయంశక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడవాలని పిలుపునిచ్చారు.
ఇప్పుడు నూతనంగా ఎన్నికైన సర్పంచులు గొప్ప ఆలోచనలతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు రచించుకోవాలి. గంగదేవిపల్లి లాంటి అభివృద్ధి చెందిన స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకొని, ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు వేసుకొని, మన పని మనం చేసుకుంటూ మన పల్లె అభివృద్ధికి పాటుపడాలని సూచించారు కేసీఆర్. ఎవరో ఏదో చేస్తారని, ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకొని ఆగం కావద్దని హితవు పలికారు. బంగ్లాదేశ్ కు చెందిన సామాజిక ఆర్థికవేత్త, స్వయం సహాయక బృందాల ఏర్పాటుకు స్ఫూర్తి దాత, ప్రొఫెసర్ యూనిస్ తో పాటు మన దేశానికే చెందిన అన్నా హజారే లాంటి దార్శనికుల గురించి వారి కృషిని వివరించారు.






