కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి గొట్టిపాటి
గుంటూరు జిల్లా : ఆరోగ్య సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. రోజువారీ వ్యాయామం, నడక, మారథాన్ వంటి శారీరక విన్యాసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా పిలుపునకు అనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్తవంతమైన నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో తణుకు పట్టణంలోని చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద తణుకు రన్నర్స్ సొసైటీ భాగస్వామ్యంతో స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తణుకు రోడ్డు రన్ 10K, 5K, 3K’ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా వైజాగ్‌లో ఐదు లక్షల మందితో నిర్వహించిన యోగా మహోత్సవం ద్వారా కూటమి ప్రభుత్వం సాధించిన గిన్నిస్ రికార్డు రాష్ట్ర ఆరోగ్య సంకల్పానికి నిదర్శనం అని అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రతి కుటుంబం, గ్రామం, పట్టణం పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉండాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం అని స్పష్టం చేశారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యసాధనలో భాగంగా ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయాన్ని శారీరక దృఢత్వం కోసం కేటాయించాలని కోరారు .






