పిలుపునిచ్చిన బీసీ జేఏసీ కో చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ : మోసం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలంటే బీసీలు ఐక్యమై సర్పంచ్ సీట్లను అత్యధికంగాగె లుచుకోవాలని పిలుపునిచ్చారు బిసి జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ . బీసీలకు రాజకీయ అధికారం దక్కాలంటే ప్రస్తుతం జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని అన్నారు. బీసీల ఓటు బీసీలకే అనే నినాదంతో బీసీ అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక స్థానాలలో గెలిపించుకొని బీసీల రాజకీయ చైతన్యన్నీ చాటి చెప్పాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 ద్వారా బీసీలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్లు అమలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 5380 సర్పంచ్ స్థానాలు దక్కేవని అన్నారు. అలా కాకుండా జీవో నెంబర్ 46 ద్వారా బీసీ రిజర్వేషన్లను 17 శాతం కు తగ్గించి మోసం చేశార న్నారు, బీసీలకు రావలసిన 3,400 బీసీ రిజర్వు స్థానాలను జనరల్ స్థానాలుగా మార్చారని , దీంతో జనరల్ స్థానాలు అంటే అగ్రకులాలవే అని భ్రమలలో ఉండి అక్రమంగా కూడబెట్టిన డబ్బుతో బీసీల ఓట్లను తమ నోట్లతో కొనుగోలు చేసి బీసీ అభ్యర్థులని ఓడించాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
గ్రామీణ ప్రాంతాలలో 90% నివసించేది బీసీ, ఎస్సీ , ఎస్టీ లేనని, 90 శాతం జనాభా ఉన్న బహుజనులు 9% ఉన్న అగ్రకులాలకు ఓటు వేయవద్దని, జనరల్ స్థానాలలో నిలబడిన బీసీ అభ్యర్థులకు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు కూడా అండగా నిలబడి సహకరించాలని కోరారు.






