సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డిపై. మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ ను నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో. ఇవాళ తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి, అంబేద్కర్, జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాడు తెలంగాణ వెనుకబడ్డది కాదు వెనుక బడేయబడ్డదని అన్నారు. కానీ నేడు రేవంత్ పాలనలో మళ్లీ వెనుకబాటుకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు హరీశ్ రావు. డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజు అని పేర్కొన్నారు. నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ఫలితమే డిసెంబర్ 9 నాటి తెలంగాణ ప్రకటన అని గుర్తు చేశారు.
నాడు కేసీఆర్ ప్రాణాలకు తెగించి కొట్లాడకపోతే డిసెంబర్ 9 ప్రకటన వచ్చేది కానే కాదన్నారు. నేడు మనం చూస్తున్న జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం ఉండేది కాదని చెప్పారు. కేసీఆర్ దీక్ష, అమరుల త్యాగ ఫలితమే ఈనాటి తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. చరిత్ర గురించి మాట్లాడితే కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం. కానీ రేవంత్ రెడ్డి అంటే వెన్నుపోటు, రేవంత్ అంటే ద్రోహం అని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామాలు చేయమంటే జిరాక్స్ పేపర్లు ఇచ్చి మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఉద్యమకారుల మీద రైఫిల్ పట్టుకొని బయలు దేరిన రైఫిల్ రెడ్డి ఆయన. అలాంటి వ్యక్తి నేడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తూ చరిత్ర హీనుడిగా మిగిలి పోతున్నాడని ధ్వజమెత్తారు.






