మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ కామెంట్స్
హైదరాబాద్ : రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం భారత్ ఫ్యూచర్ సిటీ లో జరుగుతున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2025 లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రసంగించారు అజారుద్దీన్. గ్లోబల్ సమ్మిట్‌లో మరో ప్రభావవంతమైన రోజుగా ఆయన అభివర్ణించారు, దార్శనికత, అర్థవంతమైన సంభాషణలతో నిండి ఉందన్నారు. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ క్రీడా దిగ్గజాలు పుల్లెల గోపీచంద్, పివి సింధు, జ్వాలా గుత్తా, అనిల్ కుంబ్లే, అంబటి రాయుడుతో పాటు క్రీడా మంత్రి వాకిటి శ్రీహరిలతో కలిసి తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ పై జరిగిన ప్యానెల్ చర్చలో మాట్లాడే గౌరవం లభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.
ఈ సెషన్‌ను బోరియా మజుందార్ నైపుణ్యంగా మోడరేట్ చేశారని ప్రశంసలు కురిపించారు. తమ ప్రభుత్వం పూర్తిగా క్రీడలకు సంబంధించి మౌలిక వసతుల కల్పనపై ఫోకస్ పెట్టిందని చెప్పారు. ప్రస్తుతం దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా అపారమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకునేలా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు అజారుద్దీన్. యువ క్రీడా ప్రతిభను పెంపొందించడం, అట్టడుగు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, అథ్లెట్లు రాణించడానికి కొత్త మార్గాలను సృష్టించడం పట్ల తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. తదుపరి తరం ఛాంపియన్‌లను శక్తివంతం చేయడంపై ఫోకస్ పెట్టామన్నారు.






