స్పష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి : రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది కాలంగా తీసుకున్న ముందస్తు చర్యలతో సీజనల్ వ్యాధులు 48 శాతం మేర తగ్గినట్లు తెలిపారు. 2024 సంవత్సరంలో 5,555 డెంగ్యూ కేసులు రాగా….ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 2,452 కేసులు మాత్రమే వచ్చాయన్నారు. ఈ మేరకు డెంగ్యూ కేసులు 56 శాతం తగ్గాయని తెలిపారు. గత ఏడాది 7,871 మంది మలేరియా బారినపడగా…..ఈ ఏడాది 7,010కి మలేరియా సోకిందన్నారు. మలేరియా కేసుల్లో 11 శాతం తగ్గుదల కనిపించదని వివరించారు. చికున్ గున్యా గత ఏడాది 266 కేసులు రాగా…ఈ ఏడాది 142 వచ్చాయని, చికున్ గున్యా కేసులు 46.5 శాతం తగ్గినట్లు వివరించారు.
జపనీస్ ఎన్సెఫాలిటిస్ (JE) కేసులు 11 నుంచి 2కు తగ్గినట్లు తెలిపారు. పరిశుభ్రత పెంపు, సీజనల్ వ్యాధులపై నిరంతర ప్రచారం, విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించడం, ముందు జాగ్రత్తలు కారణంగా సీజనల్ వ్యాధులు 48 శాతం మేరకు తగ్గినట్లు సీఎంకు వివరించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులను సున్నా స్థాయికి తీసుకు రావాలన్నారు. అంతా కలిసి పనిచేస్తే ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చని సీఎం తెలిపారు. సమాజంలో అతిపెద్ద జబ్బు అపరిశుభ్రతే అని….దీన్ని మార్చగలిగితే అనేక వ్యాధులను దూరం చేయవచ్చని సీఎం అన్నారు. అనేక వ్యాధులకు కారణమైన అపరిశుభ్రతను దూరం చేయాలని, ప్రజల్లో నిరంతరం చైతన్యం నింపాలన్నారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధుల నివారణకు మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. సమీక్షలో వైద్యారోగ్య శాఖ సెక్రటరీ సౌరబ్ గౌర్, వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్, ఎన్టీఆర్ వైద్యసేవ సీఈవో దినేష్ కుమార్, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ గిరీశా పాల్గొన్నారు.






