స్పష్టం చేసిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ : నాలా నెట్ వర్కుకు ఎక్కడైనా ఆటంకాలతో పాటు ముంపు ప్రాంతాల సమస్యను పరిష్కరించడంలో స్థానికులను భాగస్వామ్యం చేయాలన్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. అప్పుడే వాటి నిర్వహణలో అందరూ జాగ్రత్తలు పడతారన్నారు. బస్తీబాట అనే కార్యక్రమాన్ని చేపట్టి నాలాల్లో పూడిక తీసే పనుల్లో స్థానికుల సహకారం అందేలా హైడ్రా చర్యలు తీసుకుందన్నారు. టోలీచౌకి, గౌరిశంకర్ నగర్ కాలనీ నాలాల్లో పూడిక తీసినప్పుడు వారం, పది రోజుల ఇబ్బందులు పడినా పూర్తి సహకారం అందించారన్నారు. ఇదే పరిస్థితి పాతబస్తీ యాఖుత్పురాలో కూడా స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు పబ్లిక్ నుంచి సహకారం అందిందన్నారు.
నాలాల్లో పూడిక తీసే పనుల్లో ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులకు స్పష్టం చేశారు. ఇది తమ పరిధిలోకి రాదని, ఇంత పూడికను మేము తీయమని కాంట్రాక్టర్లు అనడానికి వీలు లేకుండా.. పనులు పూర్తి చేయాలని సూచించారు. అమీర్ పేటలోని మైత్రివనం వద్ద పూడుకు పోయిన భూగర్భ డ్రైనేజీ లైన్లను క్లియర్ చేయడం.., సికింద్రాబాద్లోని ప్యాట్నీ నాలాపై ఉన్న ఆక్రమణలు తొలగించి విస్తరించడంతో ఆ రెండు ప్రాంతాల్లో వరద ముప్పు లేకుండా చేసిన విషయాన్ని కమిషనర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒకరిద్దరి సమస్యకంటే వందలు, వేలాది మంది సమస్య పరిష్కారమే లక్ష్యంగా పని చేయాల్సి ఉందన్నారు. మరీ ముఖ్యంగా.. నాలాల్లో పూడికను తొలగించడం ఎంత ముఖ్యమో.. వాటి నిర్వహణకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందన్నారు.






