సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో విద్యా, వైద్య రంగాలు భ్రష్టు పట్టి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవిని అడ్డం పెట్టుకుని ప్రజా ధనాన్ని తన విలాసాలు, వ్యక్తిగత ప్రచారం కోసం ఖర్చు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు సీఎం ఏకంగా రూ. 100 కోట్లకు పైగా ఖర్చు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఈ డబ్బులతో పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల కోసం కేటాయిస్తే బాగుండేదన్నారు హరీశ్ రావు. ఇకనైనా ఇలాంటి చిల్లర పనులు చేయొద్దని సూచించారు.
ఓ వైపు రాష్ట్రం అప్పుల పాలైందని ఆరోపణలు చేస్తూ వస్తున్న సీఎం ఇంత భారీ ఎత్తున ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు . ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి పూర్తిగా పాలనను గాలికి వదిలి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు పిల్లలకు సరైన ఆహారం అందడం లేదని, ఏకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమ గోడు వెళ్ల బోసుకున్నా ఇప్పటి వరకు పరామర్శించిన పాపాన పోలేదన్నారు. అడ్డగోలు హామీలతో ప్రజలను మోసం చేసిన సర్కార్ ఇప్పుడు అన్నింటిని పక్కన పెట్టిందన్నారు. ఎవరు క్షమించినా ప్రజలు క్షమించే ప్రసక్తి లేదన్నారు హరీశ్ రావు.






