కేంద్ర సర్కార్ పై సంచలన కామెంట్స్
ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్ చోరీకి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళన చేపట్టింది. దేశ వ్యాప్తంగా కీలకమైన నేతలు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఆయన మోదీ సర్కార్ ను ఏకి పారేశారు. ఎస్‌ఐఆర్ పేరుతో తొలుత ఓటరు కార్డు తొలగిస్తారని, ఆ తర్వాత ఆధార్, రేషన్ కార్డ్ రద్దు చేస్తారని హెచ్చరించారు. ఆ తర్వాత వాళ్లకున్న హక్కులన్నీ గుంజుకుంటారని ఆరోపించారు సీఎం. ఈ సమస్య ఎన్నికలదో.. కాంగ్రెస్ పార్టీదో కాదు దేశ సమస్య అని గుర్తించాలని పేర్కొన్నారు.
ఈ సమస్యకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేసే పోరాటంలో కలిసి సాగేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. దేశ ప్రజలంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఆర్ఎస్ఎస్, గోల్వాల్కర్ సిద్దాంతానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. లేకపోతే మనం మనం కాకుండా పోతామని పేర్కొన్నారు. జాతీయ సమస్యగా ఓట్ చోరీ మారిందని, దీనిపై రాహుల్ గాంధీ ఒక్కడే పోరాడుతున్నాడని, ఆయనకు మనందరం మద్దతుగా నిలవాలని కోరారు సీఎం.






